kids parenting fears

అమ్మో పులి!!!

అమ్మో దెయ్యం…అమ్మో బూచోడు…అమ్మో చీకటి …అమ్మో పోలీసు …అమ్మో పులి ???

నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ, మంచం దిగి, తడబడే అడుగులతో  bedroom బయటికి వచ్చాడు రెండేళ్ళు నిండిన చిన్నూగాడు. 

వాడిని చూడడమే హుషారుగా ఎదురెళ్లి  “good morning చిన్నులూ” అంటోన్న నాన్నని పట్టించుకోకుండా వంటగది లోకి వెళ్ళిపోయాడు. 

ఎదురుగా కనిపించిన ప్రవీణ ని చూడడమే విప్పారిన మొహంతో, “అమ్మా” అంటూ వెళ్ళి వాటేసుకున్నాడు. 

“లేచావా నాన్నా” గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఎత్తుకుని వాడిని చంకలో వేసుకుంది.

బద్ధకం ఇంకా వదలలేదేమో, రెండు చేతులూ మెడ చుట్టూ వేసి భుజం మీద తల పెట్టుకు చూస్తున్నాడు. హాల్లోంచి ఓరగా వాడి వైపు చూస్తూ బుంగ మూతి పెట్టిన నాన్నని చూసి మొహమంతా వెలిగేలా ఒక్క నవ్వు నవ్వాడు. అంతే! నాన్న చేతులు చాచాడు. అమ్మ చంకలోంచి జారిపోయి చేతులు చాచిన నాన్న దగ్గరికి పరిగెత్తాడు. బద్ధకం వదిలింది. ఇల్లంతా కలియతిరిగేస్తూ ఇంక ఆటలు మొదలు. 

అప్పుడు మొదలైంది ప్రవీణ హడావిడి. వాడి చుట్టూ తిరిగి వాడికి brush చేయించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. Brush అయ్యీ అవ్వడమే పారిపోయాడు. Breakfast అనీ, పాలనీ, స్నానం అనీ ప్రతీ దానికీ వాడిని బలవంతం చేయాల్సి రావడం కష్టంగా ఉంటుంది ప్రవీణకి. 


కొత్తగా తెచ్చిన కుక్క బొమ్మ ఎగురుతూ ఉండడాన్ని చూసి లోకాన్ని మరిచి పక పకా నవ్వుతూన్న వాడిని మురిపెంగా చూసుకుంది.

ఆ వెంటనే, చెయ్యాల్సిన పనులు గుర్తొచ్చి “ఒరేయ్ ఇక్కడికి రారా! ఏ పనీ అవ్వలేదింకా!” నీరసమూ, విసుగూ దాగలేదు ప్రవీణ గొంతులో. 

వాడు పడుకున్నంత సేపూ భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంటుంది ఇంట్లో. వాడెప్పుడు లెస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి వాడిని లేపాలి అన్న కోరికని బలవంతంగా అణుచుకుంటుంది. నిద్రలో వాడి లేత మొహాన్ని, బుజ్జి చేతుల్ని ఎన్ని సార్లు ముద్దు పెట్టుకున్నా తనివి తీరదు తనకి. అది చూసి కిరణ్ నవ్వుతాడు ‘వాడు లేచాడో, అయిపోయిందే మన పని’ అని. 

వీడినా నేను రోజంతా విసుక్కునేది అని తనని తాను తిట్టుకోని రోజు లేదు.

వాడి చుట్టూ రోజంతా తిరిగీ తిరిగీ అలిసిపోతోంది. నెమ్మదిగానో, గట్టిగానో చెప్పడం తప్పడం లేదు. Energy అంతా drain అయిపోతోంది. 

అసలు వీడికి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తోంది. తినేది నాలుగు ముద్దలు కూడా ఉండదు’ అనుకుంటుంది.


పొద్దున్న ఏడింటికి మొదలైన ప్రహసనం రాత్రి పదకొండు దాకా సాగుతూనే ఉంటుంది. వాడి ఆటలూ, వాడి పరుగులూ చూస్తే ఏ నిమిషమైనా గట్టిగా దెబ్బలు తగిలించేసుకుంటాడనిపిస్తుంది. వాడు మెలకువగా ఉన్నంతసేపూ, తన గుండె వాడితో పాటు పరిగెడుతూ ఉంటుంది. Always alert గా ఉండాల్సి రావడం తో bodyకే కాదు brainకీ తీరికుండదు.  

‘అందరి పిల్లలూ ఇలానే ఉంటారా? వీడే ఇలాగా? పిల్లల్ని పెంచడం ఇంత కష్టమా?’ తల పట్టుకుంటుంది ప్రవీణ ఒక్కోసారి.
ఎదో ఒక భయం పెడితే తప్ప తిండికి కూడా లొంగటం లేదని ‘tiger’ భయం పెట్టింది. 

Look, A Tiger’s gonna come if you don’t….. (అమ్మో పులి):

tiger అమ్మో పులి

Get your child to do things with little effort of yours??

మరీ మాట విననపుడో, పని సాగనివ్వనపుడో ‘tiger’ అన్న పదం వినడమే వాడి speed కి break పడుతుంది. చిన్నగా వెనక్కి తిరిగి చూసి వచ్చి కూర్చుంటాడు. అదీ 2 minutesయే! But, అదే ఎక్కువ అనుకుంటుంది ప్రవీణ. 

వాడి బుజ్జి మొహంలో బెదురు చూడ్డమే చివుక్కుమంటుంది మనసు. కానీ తప్పడం లేదు. 

Instilling Fear is irresponsible parenting!!

ఇంటికి ఎవరైనా వస్తే ఇంకా కష్టంగా ఉంటుంది ప్రవీణకి. Tigerకి వాడు భయపడుతున్నాడని అమ్మమ్మ, నానమ్మ, తాతలు, పిన్ని, బాబాయిలు అందరూ ఆ పదాన్నివాడేసి వాడ్ని control చేయాలని చూడటం నచ్చేది కాదు. ఎలా తీసుకోవాలో, వాళ్ళకి అలా చేయొద్దని ఎలా చెప్పాలో తెలీక తికమక పడేది ప్రవీణ.  

అందరూ రకరకాల పనికి రాని సలహాలిచ్చే వాళ్ళే కానీ ఉపయోగపడే మాటలు ఎవరూ చెప్పేవాళ్ళు కాదు.  వాళ్ళు చెప్పింది చేయకపోతే దెప్పిపొడుపులు. చెప్పింది చేసినా ఎదో రకంగా మాట పడటం అయితే తప్పేది కాదు. తన వల్ల కావడం లేదు. తాను చేసేది తప్పని తెలుసు కానీ ఏం చేయాలో తెలీటం లేదు. 

ఆ రోజు ప్రవీణకి అసలు ఓపిక లేదు. కిరణ్ ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు. నిద్రొస్తోంది. వాడి energy మాత్రం ఇంకా peaksలోనే ఉంది.  Light ఆపేస్తే ఏడుస్తున్నాడు. On చేసి ఉంచితే నిద్రకి లొంగడం లేదు.  

స్నానం చేయించి బట్టలు కూడా వేసే ఓపిక లేక అలాగే వదిలేసిందేమో బట్టలు లేకుండా ఇంకా బుజ్జిగా ఉన్నాడు వాడు. కానీ, ప్రవీణకి వాడిని ముద్దులాడే ఓపిక కూడా లేదు. మంచం మధ్యలో నుంచుని గట్టి గట్టిగా ఏవో rhymes పాడుతూ గెంతుతున్నాడు. Time పదకొండవుతోంది. 

అమ్మో పులి tiger is coming fear

“చిన్నూ! ఇదే లాస్ట్ టైం చెప్తున్నా! వచ్చి పడుకుంటావా? లేదా?

ప్రవీణ మాటలు లెక్క చేయకుండా వాడి గోలలో వాడున్నాడు.

“ఉండు! తలుపు తీసి నిన్నుఅసలు బయట వదిలేస్తాను. Tiger ఉంది అక్కడ. తీసుకుపోద్ది నిన్ను వెధవానీ” గట్టిగా అరిచింది ప్రవీణ. 

Fear stricken…

ఎగిరే వాడల్లా ఆపేసి, రెండు చేతులూ గుండెల మీద పెట్టుకుని, కళ్ళు పెద్దవి చేసి “tiger దగ్గర నన్నొదిలేస్తే అది నన్ను తినేస్తుంది! అప్పుడు నేను చచ్చిపోతాను కదా అమ్మా!” అంటూ ఆగి రెండు చేతులూ ప్రవీణ రెండు బుగ్గల మీద వేసి కళ్లల్లోకి చూస్తూ  “ ఎవరితో ఆడుకుంటావ్ అప్పుడు? నేను లేకపోతే నువ్వేడుస్తావ్ కదమ్మా!” అన్నాడు. 

వాడి మాటలకి ప్రవీణ గుండె జారిపోయింది. “సారీ నాన్నా, సారీ” అంటూ గట్టిగా వాడిని వాటేసుకుంది కానీ ఏడుపాగటం లేదు. కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతున్నాయి. ఏమనుకున్నాడో ఏమో వాడూ కదలకుండా అమ్మ కౌగిట్లో అలాగే ఉండిపోయాడు. కొంతసేపటికి నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు. 

ప్రవీణకి నిద్ర పట్టడం లేదు. అంత పెద్ద మాట ఇంత చిన్న నోటి నుంచి వినడం తట్టుకోలేకపోతోంది. 


“బుజ్జి వెధవ వాడుకున్నపాటి జ్ఞానం నాకు లేదే! నా స్వార్ధానికి వాడికి లేని పోని భయాలు పెట్టి పసి మనసుని ఇంతగా exploit ఎలా చేసాను?”

కుదురుగా ఉండలేకపోతోంది. “నేను చచ్చిపోతానమ్మా” అదే మాట చెవుల్లో వినిపిస్తోంది. 

ప్రాణం మీదకొచ్చినా ఇక మీదట వాడిని భయపెట్టి ఏ పనీ చేయనని గట్టిగా నిర్ణయించుకుంది. 

నిద్రలో చిన్న నవ్వుతో విచ్చుకున్న వాడి పెదవులని చూస్తూ తెల్లారే సరికి నిద్రలోకి జారుకుంది ప్రవీణ.

1 thought on “అమ్మో పులి!!!”

  1. సింపుల్ రైటప్ బట్ టచింగా వుంది. అవును ఇది దాదాపు అందరి ఇళ్లలో జరిగే తంతే. దయ్యమనో బూచాడనో చెప్పి భయపెట్టి ఆ సమయానికి పని జరిపోయిందనుకునే వారే తప్ప ఆ మాటలు పిల్లలపై ఎంత ప్రభావాన్ని చూపిస్తాయోనని కాన్షియస్గా పెంచే తల్లి దండ్రులు నాకు తెలిసిన పరిధిలో అస్సల్ లేదు.
    మా ఇంటికి అటూ ఇటూ అందరూ భయపెట్టేవారే ఇంకా అల్లరి చేస్తే చావగొడుతుంటారు. అవి వినడం కొంచెం కష్టమే కానీ తప్పదు. కానీ ఇందులో ఆ తల్లి తాను చేసిన తప్పు తొందరగానే గ్రహించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top