శ్రీధర్, సరోజల పెళ్ళైన ఐదేళ్ళకు చిన్నారి పుట్టింది. అమ్మాయి పుట్టింది అన్న news వినడమే మొహం మాడిపోయే నాన్నలు, నానమ్మల కాలం చెల్లింది. చిన్నారి పుట్టిందని తెలియగానే ఎగిరి గంతేసాడు శ్రీధర్. అతని అమ్మా నాన్న కూడా మనవరాలిని మురిపెంగా చూసుకుని సంబర పడిపోయారు.
ఆడపిల్ల పుట్టడాన్నిaccept చేయరేమో అనుకున్న సరోజకి భర్త, అత్త మామలు చాలా గొప్పగా కనిపించారు. ఎవరూ చేయని పనిని అతి కొద్ది మంది చేస్తే, దాన్నే ఉన్నతమని భావించే Societyలో ఆమె కూడా భాగమే మరి. ఆడపిల్ల ఎదుగుదలకి మొదటి అడ్డంకి ఇంట్లోవాళ్ళే. అలా చిన్నారిని ఎదుగుదల ని ఆపేవాళ్ళు ఈ ఇంట్లో లేరని ఊపిరి పీల్చుకుంది సరోజ. “కష్టం అనేది నీ దరిదాపులకు ఇక రాదు చిన్నారీ” అనుకుంటూ కూతుర్ని సంతోషంగా గుండెలకు హత్తుకుంది సరోజ ఆ రోజు.
పుట్టిన దగ్గర్నుంచి గారాబంగా పెంచారు చిన్నారిని ఇంటిలో అందరూ. బంగారు పంజరంలోని చిలకలా కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకునే వారు. దగ్గర దూరం అనే బేధం లేకుండా చుట్టాలందరికీ చిన్నారి ముద్దే. చిన్నారిని ఎవరు ముద్దు చేసినా శ్రీధర్ పొంగిపోయేవాడు.
Respect Children’s Choices:
రెండేళ్ళ వయసప్పుడు ఎవరైనా ఎత్తుకో చూస్తే, చిన్నారి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ‘మన అంకులేనమ్మా, మన మామయ్యేనమ్మా, మన తాతయ్యేనమ్మా ‘ అని నచ్చచెప్పి తనే బలవంతంగా వాళ్ళ చేతులకి అప్పచెప్పేవాడు. మన అయిన వాళ్ళందరూ నమ్మదగిన వారే అని చెప్పకనే చెప్పేవాడు.
వెకిలి చేష్టలకి నిర్మొహమాటంగా అడ్డు చెప్పండి
ఆరేళ్ళ వయసప్పుడు, దూరపు చుట్టం అయిన ఒక తాత చిన్నారిని ‘ఏమే నన్ను చేస్కుంటావా’ అని అడుగుతుంటే ఇంట్లో వాళ్ళందరూ అదో jokeలా నవ్వేవాళ్ళు. పసిపిల్లతో అలాంటి మాటలు మాట్లాడొద్దు అని ఖరాఖండిగా ఎవరూ చెప్పలేదు. ఆ తాత ఒళ్ళో కూర్చో పెట్టుకుని, చిన్నారి కాళ్ళ మధ్యలో ఒక చేయి, చేతుల చుట్టూ ఒక చేయి వేసి గట్టిగా బిగించి వాటేసుకుంటుంటే ఎవరికీ ఎబ్బెట్టుగా అనిపించేది కాదు.
ముద్దు పేరుతో, చిన్నారి మూతి మీద గట్టిగా చప్పుడొచ్చేలా ముద్దు పెడుతుంటే, పెద్దాయనకి పిల్లలంటే ఎంత ఎంత ముద్దో అని ఇంటిల్లిపాదీ ముచ్చటగా చూసేవారు తప్ప ఆయన చేష్టలు వికారంగా అనిపించేవి కావు ఎవరికీ.
కొన్నాళ్ళకి చిన్నారి కి తమ్ముడు పుట్టాడు. చంటి పిల్లాడి పనులెన్ని ఉన్నా, చిన్నారిని మాత్రం ఎప్పుడూ neglect చేయలేదు అమ్మ-నాన్న. ఆడపిల్ల ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అన్న విషయంలో జాగ్రత్త గా ఉండేవాళ్ళు. సాయంత్రం అయిదు దాటాక బయటికి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్లాలి, కనీసం తమ్ముడినైనా. ఆడపిల్ల ఒక్కతే వెళ్ళడం అంత safe కాదని వాళ్ళ feeling!
పొరపాటున ఎప్పుడైనా చిన్నారిని వదిలేసి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పక్కింట్లోనో, ఎదురింట్లోనో, చుట్టాలింట్లోనో అయినా సరే వదిలే వాళ్ళు కానీ ఇంట్లో మాత్రం ఒక్కదాన్ని వదిలి వెళ్ళే వాళ్ళు కాదు. ఆడపిల్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకునే వాళ్ళు.
పక్కింటి uncle కి చిన్నారి అంటే బోల్డు ఇష్టం. ఎప్పుడైనా తమ్ముడ్ని ఏ హాస్పిటల్ కో తీసుకెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళింట్లో వదిలి వెళ్ళేవాళ్ళు. తన కొడుకు కంటే కూడా చిన్నారి మీదే ఇష్టమెక్కువ ఉన్నట్టు ప్రవర్తించేవాడు. ఆయన ఏ పని చేస్తున్నా, చిన్నారిని కిందకి దించేవాడు కాదు. అవసరమున్నా లేకపోయినా చిన్నారికి స్నానం చేయించేవాడు. బట్టలు మార్చేవాడు. చిన్నారికి ఇష్టమైన chocolates, biscuits ఇస్తూ సాధ్యమైనంత సమయం తన ఒళ్ళోనే కూర్చోపెట్టుకునే వాడు. చిన్నారికి ఈ uncle behaviour నచ్చేది కాదు.
I Don’t Like Him:
ఆ uncle అంటే ఇష్టం లేదని అక్కడ ఉండడం నచ్చడం లేదని అమ్మకి చెపుదాం అనుకునేది. ఎందుకు నచ్చడం లేదని అమ్మ అడిగితే ఎందుకు నచ్చడం లేదో మాటల్లో ఎలా చెప్పాలో తెలీక quietగా ఉండిపోయేది. ‘ఆ అంకుల్ దగ్గరికి నేను వెళ్ళను’ అని మాత్రం చెప్పేది. uncle కనిపిస్తే పారిపోయేది. తప్పించుకుని తిరిగేది. చిన్నారి తప్పించుకుకుని తిరుగుతుంది అని తెలుసుకున్న uncle ఇంటికే వచ్చేసేవాడు.
మంచిగా మాట్లాడుతూ ఇంట్లో అందరినీ మంచివాడని నమ్మించేవాడు. చిన్నారి మంచి కోరుకునే మంచి వాడిలా buildup ఇచ్చేవాడు. చిన్నారి పొరపాటున ఇంట్లో ఏమైనా చెప్పినా తన మీద అనుమానం రాకుండా ఉండేలా ప్రవర్తించేవాడు. చిన్నారి మీద ఉన్నవీ లేనివీ complaints చెప్పి చిన్నారిని తిట్టించేవాడు. చిన్నారిని ఓదార్చడానికి దొరికే అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు. చిన్నారిని మంచి చేసుకోడానికి అన్ని రకాలుగా ప్రయతించేవాడు.
చిన్నారికి తొమ్మిదేళ్ళు. ఒక రోజు సరోజ, పక్కింటావిడతో కలిసి shoppingకి వెళ్ళింది. శ్రీధర్ ఇంట్లోనే ఉన్నాడు. పక్కింటి అంకుల్ వాళ్ళబ్బాయిని తీస్కుని చిన్నారి వాళ్ళ ఇంటికి వచ్చాడు. చిన్నారి దూరంగా జరుగుతున్నా ఆడించే నెపంతో చిన్నారి పక్కనే కూర్చున్నాడు. ఇంతలో, శ్రీధర్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరో వస్తే మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు.
Juice తాగుతున్న చిన్నారిని పట్టుకోబోతే చిన్నారి పారిపోబోయింది. ఈ లోపల చేతిలో ఉన్న juice అంతా మీద ఒలికిపోయింది. కోపంగా ‘జాగ్రత్తగా ఉండలేవా’ అంటూ గబా గబా చిన్నారి బట్టలు విప్పేయబోయాడు. చిన్నారి uncle చేతిని గట్టిగా కొరికేసి, uncle తనను అందుకోనేలోపు బయటికి వాళ్ళ నాన్న దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. వెనకాలే uncle కూడా వెళ్ళాడు. “నాన్నా ఈ uncle….” అని చిన్నారి ఎదో చెప్పబోయేలోపు “juice అంతా కిందా మీదా పోసేసింది శ్రీధర్, తుడుద్దాం అని చూస్తుంటే నన్ను కోరికేసింది చూడు” అని చేయి చూపించాడు.
శ్రీధర్ కాళ్ళని చుట్టేసుకుని వదలకుండా ఏడుస్తోంది చిన్నారి . ఆఫీస్ వాళ్ళ ముందు చిన్నారి అలా ప్రవర్తించడం చిన్నతనంగా అనిపించి చిన్నారిని విదిలించుకుంటూ “మొండితనం మరీ ఎక్కువైపోయింది, పో! లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో” అని తోసేసాడు. అయినా చిన్నారి వదలకుండా కాళ్ళనే పట్టుకు వేలాడుతుంటే వీపు మీద ఒక్కటిచ్చాడు. “నేను మారుస్తాలే శ్రీధర్, చిన్నపిల్లని అలా కొట్టకు” అంకుల్ తన అతి మంచి తనాన్ని ప్రదర్శిస్తూ చిన్నారిని లోపలికీడ్చుకుపోతుంటే ఇంతలో సరోజ వాళ్ళు వచ్చారు.
“ఎందుకే అలా ఏడుస్తున్నావు?” పరిగెడుతూ చిన్నారి దగ్గరకొచ్చింది సరోజ. అమ్మని చూసి ఏడుపాపేసింది. చిన్నారి కళ్ళు తుడుస్తూ లోపలి తీసుకొచ్చింది సరోజ. పక్కింటి aunty, uncle వాళ్ళింటికి వెళ్ళిపోయారు. అమ్మ ఇల్లంతా తుడిచింది. చిన్నారి బట్టలు మార్చుకుంది.
తరువాత అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వళ్ళో పడుకుని “నాకు ఆ అంకుల్ అంటే ఇష్టం లేదు” అని చెప్పింది.
“తప్పమ్మా అలా అనకూడదు, ఆ అంకుల్ మంచోళ్ళమ్మా!” దగ్గరికి తీసుకుంటూ అంది.
“మంచోళ్ళంటే?” చిన్నారి తిరిగి అడిగింది.
“అంకుల్ బాగా చదువుకున్నారు. మంచి జాబ్ చేస్తున్నారు. అయినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా ఎలా ఉంటారోచూడు! నాన్నకి ఏ help కావాలి అన్నా చేస్తారు. ఇంట్లోకి urgent గా ఏమైనా కావాలంటే తెచ్చిపెడతారు. వాళ్ళ బాబు కంటే నువ్వంటేనే ఎక్కువిష్టం కదా?” ముద్దు పెట్టింది అమ్మ.
చిన్నారి తన Genitals చూపిస్తూ “ఇష్టం ఉంటే ఇక్కడ వేళ్ళు పెడతారా? నాన్నకి కూడా నేనంటే ఇష్టమే కదా. నాన్నెప్పుడూ అలా చేయలేదు?” ఏడుస్తూ అంది.
“నాకు ఆ అంకుల్ నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు” గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది చిన్నారి.
ఒక్క నిమిషం సరోజ కి చిన్నారి ఏం చెప్పిందో అర్ధం కాలేదు. అర్ధం అయ్యాక బిగదీసుకుపోయింది. ‘పైకి అంత మంచిగా కనిపించే మనిషి ఇలా చేస్తున్నాడా? చిన్నారి చెప్పేది నిజమా? ఇప్పుడేం చేయాలి? ఎవరికన్నా తెలిస్తే ఏమౌతుంది?’
‘ఎవరికైనా తెలిస్తే’ అన్న ఆలోచనకే సరోజ కి వణుకు లాంటిది వచ్చింది.
‘అసలే ఆడపిల్ల. ఈ విషయం బయటికి తెలిస్తే దాని బతుకేమౌతుంది? రేపు నలుగురూ దాన్ని ఎలా చూస్తారు? అసలు నలుగురిలో తలెత్తుకు ఎలా తిరగాలి? అందరూ మా వెనకాల ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో కదా! నా పెంపకాన్ని తప్పు పడతారు. కుటుంబం పరువంతా పోతుంది. అసలు ముందీ విషయం శ్రీధర్కి ఎలా చెప్పాలి? చెప్తే ఏం చేస్తాడు? వెళ్ళి ఆ వెధవని నాలుగు పీకుతాడా? చిన్నారి అంటే ప్రాణం కదా! అయినా అసలు ఇలాంటి విషయాలు ఎలా అడుగుతాం? ఏమని అడుగుతాం? అతను ఏం అనుకుంటాడు? ఒకవేళ చిన్నారి తప్పు చెప్తుందేమో? అతను మంచోడేనేమో……. ‘
ఇలాంటి ఆలోచన ఒకటి రావడమే తన మీద తనకి అసహ్యం వేసింది. ‘ ఛీ!! ఏం ఆలోచిస్తున్నాను నేను? అసలు వాడు మంచోడేంటి? చిన్నారి తప్పు చెప్పడమేంటి? చిన్న పిల్లతో అలా ప్రవర్తించేవాడు ఏ రకంగా మంచోడు? ఎంత చదువుకున్నోడైతే మాత్రం ఏంటి? వాడికి ఎంత హోదా ఉంటే మాత్రం ఏంటి? వాడెంత గొప్ప వాడైనా కూడా వెధవే!’
వళ్ళో చిన్నారి ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది. నిద్రలో దాని మొహంలో ప్రశాంతత, safeగా ఉన్నానన్న ధీమా. సన్నగా నవ్వు కూడా! ఏం కల కంటుందో? నుదురు మీద చిందరవందరగా పడి ఉన్న జుట్టుని వెనక్కు తోసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది కూతుర్ని. దాన్నలా చూస్తూ ఉంటే ఆవేశం లాంటిదేదో పట్టి ఊపేసింది తనని!
Trust what children say without a second thought! Even if they are wrong, you hardly lose anything.
‘చిన్నారి ఎప్పుడూ వాడికి దూరంగా ఉండడానికే చూసేది. వాడంటే ఇష్టం లేదనే చెప్పేది. నేనే పట్టించుకోలేదు.
వాడు మంచోడని నేను ఎలా అనేస్కున్నాను?
మంచిగా మాట్లాడితేనే, helpfulగా ఉంటేనో, పెద్ద job ఉద్యోగం చేస్తుంటేనో, లేక నలుగురిలో మంచి పేరుంటేనో మంచి వాడై పోతాడా?
వాడిలాంటి వాడని ఎలా తెలుస్తుంది? తన వికృత రూపాన్నినాలుగు గోడల మధ్యన తన కంటే బలహీనులైన చిన్న పిల్లల ప్రదర్శిస్తూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్ళని అసలెలా గుర్తు పడతాం?
సొంత తల్లినైన నేనే దాని మాటల్ని నమ్మకపోతే ఎటు పోతుంది అది?
అమ్మకీ, నాన్నకీ కాక పిల్లలు, వాళ్ళకొచ్చే ఇబ్బందుల గురించి ఇంకెవరికి చెప్తారు? అన్నీ మరిచి హాయిగా, ఏ భయము లేకుండా నిద్రపోగలిగే చోటు అమ్మ, నాన్నల దగ్గరే కదా? మా అమ్మ నాన్న చూసుకుంటారు అనే కదా?
మరి నేనేంటి అలాంటి చంటి పిల్ల గురించి ఆలోచించకుండా, తప్పు చేసిన వాడిని నిలదీయకుండా మంచోడు అని సర్దిచెప్పుకుంటున్నాను?
అదే విషయం ఆ పిల్లకి కూడా చెప్తున్నాను? Society గురించీ, వాళ్ళు మాట్లాడే మాటలు గురించి ఆలోచిస్తున్నానేంటి? నాకేది ముఖ్యం? చిన్నారా? సమాజమా? ఈ రెండిటిలో ఎంచుకోవాల్సివస్తే రెండో ఆలోచన లేకుండా చిన్నారిని కదా ఎంచుకోవాలి?
నేనేంటి చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తున్నాను? అసలు చిన్నారిది ఏం తప్పు ఉందని? అదేం చేసింది?’
వళ్ళోని చిన్నారి నెమ్మదిగా దిండు మీదకి జరిపి ఒక్క ఉదుటున కిందకి దిగింది. బాబు బయట ఆడుకుంటున్నాడు. హాల్లో ఉన్న శ్రీధర్ దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పింది. సరోజ చెప్పిన విషయం విన్నశ్రీధర్ అచేతనంగా నిలబడిపోయాడు.
“ఇంక పొరపాటున కూడా చిన్నారి ని అటు వెళ్ళనీయకు” అన్నాడు కొంత సేపటికి తేరుకుని.
“అంటే? అతన్ని అలాగే వదిలేద్దామా?” సూటిగా అడిగింది సరోజ బయటికి నడుస్తూ.
“ఎక్కడికి?” సరోజ వెనకాలే నడుస్తూ అడిగాడు.
“వాడిని వదలను. మన పాప జోలికి రాకుండా ఆపగలం కానీ వేరే పిల్లల జోలికి వెళ్ళకుండా ఆపలేం కదా? వాడింక ఏ పిల్లల జోలికీ వెళ్ళకూడదు.”
ఎదురుగా ఆటోలోంచి అత్తమామలు దిగారు. “పిల్లల్ని కాసేపు చూస్కోండి అత్తయ్యా” చెప్పేసి పక్కింటి గుమ్మం వైపు తిరిగింది.
పక్కింటావిడ బయట నుంచుని పిల్లాడికి ఎదో తినిపిస్తోంది. అతను కూడా పక్కనే ఉన్నాడు. వీళ్ళు రావడం చూసి అతను “రండి రండి” అని ఎదో అనబోతుంటే రోడ్డు మీదకి ఈడ్చుకెళ్లింది అతన్ని collar పట్టుకుని. “ఇంకొక్కసారి చిన్నారి జోలికి గానీ ఇంక వేరే ఏ పిల్లల జోలికి కానీ వెళ్ళావో….” చెంప పగలకొట్టింది. రోడ్డు మీద అందరూ ఆగిపోయి చూస్తున్నారు.
“చిన్న పిల్లలతో అలా ప్రవర్తించడానికి సిగ్గు లేదూ?” గట్టిగా అరిచింది. ఇంటి చుట్టు పక్కల వాళ్ళు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏమౌతుందో అన్నట్టు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోయి చూస్తున్నారు. అతను తప్పించుకుని లోపలి వెళ్ళిపోబోతుంటే మళ్ళీ రోడ్డు మీదకి లాగింది.
“చేసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడు వచ్చిందా?”
అందరూ గూమి గూడారు. ఏమైందని అడిగితే శ్రీధర్ చెప్పాడు. ఎవరెవరో వచ్చి ఎదో మాట్లాడుతున్నారు. అతన్ని తిడుతున్నారు. కొంతమంది పోలీసులకి అప్పచెపుదాం అని అతన్ని పోలీస్ స్టేషన్ వైపు లాక్కెళ్ళారు.
వాడిని నలుగురిలో నిలబెట్టాక, అప్పటిదాకా లోపల పేరుకున్న దుఃఖమంతా బయటికి వచ్చేసింది సరోజకి. శ్రీధర్ సరోజని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ‘ఎవరికీ తెలీదు అనీ , పిల్లలు ఎవరికీ చెప్పరు అనీ, చెప్పినా ఎవరూ తనని అడగరు అని ఇలా ఇంకెంత మంది సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారో?’ అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది ఇద్దరికీ.